ఈరోజు విద్యాలయ నుంచి కట్టకొమ్ము గూడెం సాగర్ కాలువ వరకు (3+3=6) కి.మీ దూరపు నడక విద్యార్దులతో కలిసి వెళ్లాము. ప్రకృతిలో నడక ఓ గొప్ప అనుభూతి. అదినూ చుట్టూ ధవళ వర్ణపు కాంతితో ఈనులీరి కోత కొచ్చిన వరి చేల సోయగం, కంకులను తినేందుక వాలుతున్న పక్షుల కిలకిల రావాల సవ్వడి, గ్రామీణ సూరాపానమైన కల్లు గీతకై నిటారుగా ఎదిగిన తాటి చెట్టు ఎక్కుతున్న గౌడన్న కష్టం, సాగర్ కాలువ వెంట వంకర టింకర దారుల్లో పయనం . చివరకు పెద్ద కాలువ గట్టుకు చేరాము, కాలువ లోకి దిగగానే చల్లని స్పర్శ తో కాళ్లు జలదరించాయి. చల్లని నీళ్లు ముఖాన్ని తాకుతుంటే కలిగే స్పర్శ వర్ణించనలవికానిది. అదో మధుస్పర్శానుభూతి.
ప్రకృతిలో దూరపు నడక మానసిక, శారీరకోల్లాసానికి మంచి మార్గం.