30 ఏళ్ళ కృషి ఫలించిన వేళ
**********************
“ ఈ ప్రపంచంలో రాణించటానికి అత్యుత్తమమైన ఆయుధం చదువు మాత్రమే. “
.........నెల్సన్ మండేలా
పేదరికం, కుటుంబ నేపథ్యం , కులం, మతం, ప్రాంతం, భాషా తారతమ్యాలేవి చదువు కోవాలనే పట్టుదలను ఆపలేవు.
సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1991 జూలై మాసంలో ఇంటర్మీడియెట్ ఇన్స్టంట్ పరీక్షలో పాసై , డిగ్రీ కోసం ప్రైవేట్ ( E.V.R Memorial) కాలేజి , కోదాడలో చేరిన నాటి స్వప్నం. ఇంటర్ ఫెయిలై ఒక సంవత్సరం ఇంటి వద్దే ఉండి నాన్నతో కలిసి వ్యవసాయం చేసిన రోజుల్లో రగిలిన కసి అది. అథ్లెటిక్ పోటీలలో 100 మీటర్ల పరుగు ఎలాగో చదువుల పోటిలో క్విజ్ అలాగే అని నమ్మిన రోజులవి.
అపారమైన జ్ఞాపకశక్తి, వేగవంతమైన మస్తిష్క మథనం, చురుకైన సమయ స్ఫూర్తి , సకల అంశాల మీద ప్రావీణ్యం ఇవన్నీ కలిస్తేనే క్విజ్. అందుకే క్విజ్ లో రాణించాలని నా మనసులో బలమైన బీజాలు పడిన రోజులవి. ప్రతిరోజు ఉదయం రెండు గంటలు దినపత్రికలు చదవటం, సాయంత్రం గ్రంథాలయం కు వెళ్లటం, రాత్రికి క్విజ్ కు సంబంధించిన పుస్తకాలు చదివి రాసుకోవడం నిత్యకృత్యాలుగా మారిపోయాయి. డిగ్రీ మూడు సంవత్సరాలు చాలా కష్టపడి చదివాను. జిల్లా స్థాయిలో ఎక్కడ క్విజ్ పోటీలు జరిగినా తప్పక వెళ్లి పాల్గొనేవాన్ని. మూడు సంవత్సరాల కష్టం ఊరికే పోలేదు. డిగ్రీ రాజనీతి శాస్త్రం ( Political Science) లో బంగారు పతకం రూపంలో లభించింది. 1994 ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ‘చరిత్ర ‘ లో సీటు దొరికింది.
క్విజ్ అనేది కూడా ఒక పెద్ద వ్యసనం. కాకుంటే ఇది విజ్ఞానాన్ని సంపాదించేందుకు దోహదపడే ఒక మంచి వ్యసనం. హైదరాబాద్ ఎక్కడ క్విజ్ జరిగినా వెళ్లటం అలవాటైపోయింది. 1995 లో దూరదర్శన్ లో మన్ మోహన్ దత్ గారు రాష్ట్ర స్థాయి క్విజ్ తెలుగులో మెుదటిసారి నిర్వహించారు. నేను మితృడు నాగయ్య ( ప్రస్తుతం నల్గొండలో లైబ్రేరియన్ ) జట్టుగా క్విజ్ కై మెుదటసారి కెమెరా ముందు పాల్గొన్నాము. మేమే గెలిచాము. 1995 లో అప్పుడప్పుడే ఈ.టి.వి మరియు జెమిని టి.వి ప్రారంభించిన రోజులు. రెండింటి లోనూ క్విజ్ నిర్వహించారు, రెండు ప్రథమ స్థానంలో గెలిచాము. అవన్నీ సుమధుర జ్ఞాపకాలు.
నా డిగ్రీ అయిపోతూనే 1994 లో రాసిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూపు పరీక్ష ద్వారా మంచి ర్యాంక్ తో 1996 లో ఉద్యోగం సంపాదించాను. నాకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలనే బలమైన వాంఛ బడి వైపు నడిపించింది. అత్యుత్తమ దశను అధిరోహించిన క్రీడాకారుడు సైతం తన పోటీ ఇక ముగిసిందని ఎన్నడు అనుకోడు. తన పరిజ్ఞానం తన తర్వాత తరానికి అందించాలనుకుంటాడు. నేను అదే పంథాలో వెళ్లాను.
సరైన మార్గ నిర్దేశం చేస్తే గ్రామీణ ప్రాంత చిన్నారులు సైతం రాష్ట్ర, జాతీయ స్థాయి చదువుల పోటీలలో రాణించగలరని మెుదటి నుంచి నాకు ప్రగాఢమైన నమ్మకం. కనీసం పదవ తరగతి తర్వాత ఏమి చదవాలో కూడా తెలియని పరిస్థితి నాది. చదువు కోవాలనే చైతన్యం లేని గ్రామం నుంచి మెుదటి సారి డిగ్రీ , పీ.జి చేసి ఉద్యోగం సంపాదించాను. చదువుల పట్ల చైతన్యం లేని పిల్లలకు , తల్లితండ్రులకు పట్టుదల ఉంటే గ్రామీణ చిన్నారులు సైతం ఏదైనా సాధించగలరనే విశ్వాసం నెలకొల్పేందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నాను.
వ్యాపార కాంక్షతో కాకుండా , బలమైన స్ఫూర్తి తో విద్యాలయను 2012 లో ప్రారంభించాము. కేవలం 300 మంది చిన్నారులతో ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నడిస్తున్న బడి మాది. కనీస సౌకర్యాలతోనే అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాము. 85% మంది పిల్లలు గ్రామీణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్లే. ఏదో ఒక రోజు మా కోదాడ చిన్నారులు జాతీయ స్థాయి క్విజ్ లో గెలవాలనుకునే వాన్ని. 2012 లో విద్యాలయ ప్రారంభించినప్పటి నుంచి వివిధ రకాల క్విజ్ లలో జాతీయ స్థాయి (National) ఫైనల్స్ కై ఢిల్లీకి సుమారు ఓ 30 సార్లు వెళ్లమంటే నా చిన్నారుల ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. పది సార్లకు పైగా జాతీయ విజేతలుగాను నిలిచాము.
కరోనా సంక్లిష్ట పరిస్థితులలో సైతం డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన “India Quiz Championship 2021” తేజ చిన్నారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దేశ వ్యాపితంగా 20,000 పాఠశాలలతో పోటి పడి “ అత్యుత్తమ క్విజింగ్ పాఠశాల “ గా నిలిచింది. మెట్రో , కాస్మో పాలిటన్ నగరాలలోని పెద్ద పెద్ద కార్పోరేట్ మరియు ఇంటర్నేషనల్ బడులను అధిగమించి ఒక చారిత్రక విజయాన్ని అందుకుంది. బడా బడా పట్టణాల్లోని పాఠశాలలకు ధీటుగా నిలవటం వెనుక నా 30 ఏళ్ల స్వప్నం దాగి ఉందని నమ్ముతున్నాను.
మన స్వప్నం ఫలించిన క్షణాలు ఉద్విగ్నంగా ఉంటాయి. ఆ స్వప్నం తాలుకు శ్రమ ఆ నిమిషాన అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ప్రతి క్విజ్ జర్నీ లో ఉండే శ్రమ , ప్రణాళిక , పిల్లలతో మమైక్యమయ్యే విధానం అన్నీ కూడా భవిష్యత్ లో నెమరవేసుకునే అందమైన జ్ఞాపక పుటలుగా మారిపోతుంటాయి. ఈ ప్రయాణంలో నన్ను నడిపించిన గురువర్యులకు , సహాకరించిన శ్రేయోభిలాషులకు సర్వదా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని పట్టుదలతో అభ్యసించే ప్రతి చిన్నారికి ముఖ్యంగా విద్యా చైతన్యం లేని కుటుంబాలనుంచి వచ్చే పిల్లలకు అంకితం చేస్తున్నాము.
నా ఈ జర్నీ లో పిల్లలకు నేర్పే క్రమం లోనే పిల్లలతో కలిసి దేశమంతట తిరిగాము, ఆఖరికి సింగపూర్ కూడా వెళ్లాను. ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో భారత రక్షణ శాఖా మాత్యుల ఆతిధ్యం స్వీకరించాము, ప్రజారంజకమైన టి.వి షో” మీలో ఎవరు కోటీశ్వరుడు” లో చివరి ప్రశ్నను సైతం ఎదుర్కొన్నాను. క్విజ్ నా జీవితాన్ని మాత్రమే కాదు.... నాతో జర్నీ చేసిన ఎందరో చిన్నారుల జీవితాలను మార్చివేసింది. ఎన్నో అందమైన జ్ఞాపకాలను పది కాలాలపాటు వారి మదిలో పదిలంగా నిలిపేలా చేసింది. ఇదంతా క్విజ్ మహిమ అని నేను సగర్వంగా చెప్పుకుంటాను.
నిన్న అనేది ఒక జ్ఞాపకం - అది మధురంగా ఉండిపోవాలి.
నేడు అనేది ఒక ఛాలెంజ్ - నలుగురికి మార్గనిర్దేశంగా చేయాలి.
రేపు అనేది ఒక స్వప్నం - ఆశయాల ఆశలకు రెక్కలు తొడగాలి.
జీవితం అంటే నిస్సారమైనది కాదు., వేయి కరోనాలు వచ్చినా బలమైన మన స్వప్నాలను ఏవి ఆపలేవు. “ నిరంతర చైతన్య శీలమైన మనిషి మస్తిష్క గమనమే ఈ విశ్వపు అవధులను దాటేలా చేసింది..” అన్న రాహుల్ సాంకృత్యన్ మాటలు ఎప్పుడూ నా మదిలో మార్మోగుతూనే ఉంటాయి.